IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


లాలాజీ శకము –మాసముల నామకరణములు.

  

"ఆయన అవతరణచే ప్రారంభమైన యీ ఆనందపూరిత సమయం ఆధ్యాత్మిక చైతన్యంలో వొక నూతన శకాన్ని ప్రవేశపెట్టింది.  మానవ జీవిత సమస్యకు అనుభవ పూర్వక పరిష్కారమును అది అందజేస్తుంది. "

- పూజ్య శ్రీ రామచంద్రజీ మహారాజ్

లాలాజీ శకము –మాసముల నామకరణములు.

పూజ్య లాలాజీ మహరాజ్ ద్వారా నాంది పలికిన కొత్తశకమునకు నామ కరణము చేయవలెనన్న యెఱుక మాకు యెంతో సంతోష జనకము.  ఆయన యాశీస్సులతో యీ శకమునకు లాలాజీ శకమని నామకరణము చేయబడినది.

ఆయన అవతరణతో 1873లో కొత్తశకము ప్రారంభమైనను మనము 1990 వరకు యీ శకములోని సంవత్సరాలను లెక్కించలేదు. క్రొత్త శకారంభమునుంచి సంవత్సరములను లెక్కించుటకు శ్రీరామచంద్ర చైతన్య స్రవంతి సాహసించినదని నేను వినమ్రతా భావంతో తెలియబరుచుచున్నాను.  చాలాకాలంగా మన స్వంత కాలెండరు యొకటి వుండాలనే వొకాలోచన శ్రీరామచంద్ర చైతన్యస్రవంతి యొక్క దృష్టిలోవుంది.  మాసములను లెక్కించుటకు సౌరమాన పద్దతి మరియు చాంద్రమాన పద్దతులలో దేనిని యనుసరించాలా యని యిదమిద్ధంగా తేల్చలేక వుండినాము. ఎందుకంటే దేని ప్రయోజనాలు వాటికి వున్నాయి.  వాస్తవములో మనము మన ఖగోళ శాస్త్రాధారిత పంచాజ్ఞములకు భిన్నముగా నిలుపుకోశక్యముగాని వింత తర్కముగల ఆంగ్ల కాలండర్లతో సంవత్సరాలను లేక్కపెడతాము.

శ్రీరామచంద్ర చైతన్య స్రవంతిలో దీనికి సంబందించిన నిపుణులు లేని కారణముగా మనం మన ప్రియతమ పూజ్య బాబూజీ మహరాజ్ వారి పద్థతిలో సూచించిన వివరణననుసరించి మాసములకు నామకారణము చేయాలని నిర్ణయించినాము. ప్రస్తుతానికి ప్రభవాది నామసంత్సరముల పద్ధతినిననుసరించక మనము సంవత్సరముల సంఖ్యను లెక్కపెట్టుటతో తృప్తి చెందుదాము. క్లుప్తముగా మాసములకు నామములను నిర్ణయించుటలోని వివరణను నేను మీ ముందుంచుతున్నాను.  జనవరి 13న కాని 14న కాని సూర్యుడు మకర రాశియందు ప్రవేశిస్తాడు.  అందుచేత జనవరి 14వ తారీఖును లాలాజీ  శకములో నూతన సంవత్సరమునకు యుగాదిగా తీసుకున్నాము.  ఇప్పటివరకు లాలాజీ శకములోని మాసముల పేర్లతో కూడిన కాలండర్ మన వద్ద లేదు.

మనము పూజ్య లాలాజీ మహరాజ్ గారికి సర్వదా ఋణపడి యున్నాముగనుకాయన పేరుతో సంవత్సరారంభించడము ఔచిత్యం.  అంతేగాక యీ మాసములోనే మాఘ శుద్ధ పంచమినాడాయన అవతరించారు.  ఆయనత్యంత కృపామయుడు మరియు సమవర్తి.  అందుకని ఈ మాసమును, సమవర్తి అని పిలుచుకొనటం యెంతైనా సబబు.  ఇది మనకు యీ సంవత్సరమంతా జరిగేది న్యాయంగా ధర్మంగా మరియు భగవంతుని నిర్దేశ ప్రకారము జరుగుతుందని మరియు మాస్టరు గారి పట్ల పరిపూర్ణ విశ్వాసముతో మన సాధన కొనసాగుతుందనే ధైర్యము కలుగజేస్తుంది.

ధ్యాన సమయమున సాధకునిలో ప్రాణస్యప్రాణః ప్రవేశపెట్ట బడుతుందిగనుక రెండవ మాసమునకు ప్రాణ అని నామకరణము చేయబడినది.  ఆది గురువు ఈ ఆధ్యాత్మిక శక్తిని సాధకునిలోనికి ప్రవేశపెట్ట బడటానికి యనుమతిని సంపాదించి భగవంతుడు మన వైపు వచ్చుటకెంత ఆతృతను చూపుతున్నారో ఆచరణాత్మకముగా ఋజువుపరిచారు.  ఈ ప్రాణాధారమైన ప్రాణస్య ప్రాణఃతో యనుసంధానమే మన సాధనా పద్ధతి యొక్క ముఖ్య విషయము.

ప్రాణస్యప్రాణఃకి మూలమై, సమస్త అస్తిత్వానికి మాతృవు భూమ . అందువలన మూడవ మాసమునకు భూమగా నామకరణము చేయబడినది.

మన ప్రభువు - ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహరాజ్ గారి జన్మదినమయిన బైసాకి బడీ పంచమి వైశాఖ మాసములో వచ్చినందున యీ నాల్గవ మాసమునకు ప్రభు యని నామకరణము చేయబడినది.  ఆయన మన జీవితంలో సమస్థ విషయాలలోనూ యన్ని విధములుగానూ మనకు మార్గదర్శియై మరియు మనలను సత్పురుషులుగా మలచుటకు తోడ్పడుతున్నారు.

మనలోని మూల స్పందనల వ్యుత్పత్తికి కారణమై మనకు కేంద్రముతో విడరాని సంబంధంమేర్పరచే క్షోభ్ కి గుర్తుగా యయిదవ మాసమునకు భఁవర్ యని నామకరణము చేయబడినది.

మన ప్రభువు పూజ్య బాబూజీ మహరాజ్ వారి సన్నిహితుడు పూజ్య ఈశ్వర్ సహాయ్ గారు.  వారి గుర్తుగా ఆరవ మాసమునకు ఈశ్వర్ అని నామకరణము చేయబడినది.

పూజ్య బాబూజీ మహరాజ్ పద్దతిని అభివృద్ది చేయుటయందు మరియు విస్తారింపచేయుటలోనూ సాటిలేని సేవలందించి ప్రభువుకి సఖుడైన పూజ్య డాII.కె.సి.వరదాచారిగారి పేరుతో యేడవ మాసమునకు వరద యని నామకరణము చేయబడినది.  ఆయన దయానిధి కృపవలననే మన పద్ధతిలో శిక్షణకు నూతన పరంపరయేర్పడి మానవుడు శిఖరాగ్ర స్ధితులను చేరుకోగలుగుట సాధ్యపడుతున్నది.

అవతార పురుషుడయిన కృష్ణ భగవానుడు పూజ్య బాబూజీ మహరాజ్ వారి అన్ని సంస్థల యొక్క అధిపతి (ఎందుచేతననగా వారిరువురిలో భేదములేదు). ఆయన పుణ్యతిధి యీ మాసములోనే వున్నందున ఎనిమిదవ మాసమునకు కృష్ణ యని నామకరణము చేయబడినది.

అందరినీ సమదృష్టితో చూడడం అనేది కృష్ణ భగవానుని స్వభావము.  అందుచేత తొమ్మిదవ మాసమునకు సమదృష్టి యని నామకరణము చేయబడినది.

సత్యపధమార్గము ద్వారా మనము సాధన యొక్క ప్రాధమిక లక్ష్యం చేరుకొనెదము.  దీనిని సూచిస్తూ పదవ మాసమునకు సత్ పధ్ గా నామకరణము చేయబడినది.

ప్రేమస్వరూపుడైన కృష్ణ భగవానుని సఖి రాధ గారు.  అందుచేత పదకొండవ మాసమునకు రాధ యని నామకరణము చేయబడినది.

మన పధ్ధతిని తీర్చి దిద్దుటలో స్వామీ వివేకానందుని తోడ్పాటు పూజ్య బాబుజీ మహారాజ్ గారిచే పూర్తిగా గుర్తించబడినది.  దీనిని సూచిస్తూ పన్నెండవ మాసమునకు వివేక యని నామకరణము చేయబడినది.

ముందుగా అన్నిమాసములలోని రోజులు సమముగా వుండేటట్లు చేయబడినవి. ఆ తరువాత 365 రోజులను పూర్తి చేయుటకు  సమవర్తి, ప్రభు, ఈశ్వర్, వరద, కృష్ణ, మాసములకు ఒక్కొక్క రోజు కలుపబడినది. సమవర్తి మరియు ప్రభు వొకటే యెందుచేతనంటే బాబూజీగారిలో లాలాజీగారి లయ సంపూర్ణము.  అందువలన సమవర్తి మరియు ప్రభు మాసములకు 31 దినములను కేటాయించాము.  ఈశ్వర్ సహాయ్ పేరుతో వున్న మాసము ఈశ్వర్ కు కూడా వొక రోజు కలపబడినది.  పూజ్య డాII కే.సి.వరదాచారి గారు మనకు మన ప్రభుతో వున్న అనుసంధానము.  అందుచేతాయన పేరుతో పెట్టిన మాసమునకు కూడా వొక రోజు అధికముగా యివ్వడమయినది.  శ్రీకృష్ణ భగవానుడు మన సంస్థ అధిపతయినందువలనాయన మాసమునకుగూడా వొక రోజధికముగా యివ్వబడినది.

ప్రస్తుతము సంవత్సరాల పేర్లు చంద్రమాన మాసములననుసరించు మన పంచాజ్ఞము ప్రకారమే వుంచడం జరుగుతుంది.